అంతవరకూ బృందావనంలో బాలుడుగా పెరిగిన చిన్ని కృష్ణుడు పెద్దవాడయ్యాడు. మధురానగరంలో జరిగే వేడుకలకు పాల్గొనవలసిందని నందబాలునికి మామయ్య కంసుని ద్వారా శ్రీముఖం అందింది. జనపదాల్లో పెరిగిన బాలుడు అన్నయ్య బలరామునితో కలిసి నగరానికి వచ్చిపడ్డాడు. విశాలమైన నగర వీథుల్లో సింహశాబకాల్లా అన్నతమ్ములు నడుస్తున్నారు. అప్పుడు ఆ నగరంలో ఉన్న అందమైన అమ్మాయిల కృష్ణున్ని చూడాలని మేడలు ఎక్కేరు.
కం|| వీటఁ గల చేడె లెల్లను హాటకమణిఘటితతుంగహర్మ్యాగ్రములం గూటువలు గొనుచుఁ జూచిరి పాటించి విశాలవక్షుఁ బద్మదళాక్షున్.
ఇళ్ళల్లో ఉన్న యువతులందరూ పసిడికాంతులు విరజిమ్ముతూ మణులు తాపడం చేసిన ఘనమయిన మిద్దెలపైకెక్కి గుంపులు గుంపులుగా చేరి కళ్ళప్పగించేసి విశాలవక్షుడు, పద్మదళాక్షుడైన పుండరీకాక్షుణ్ణి చూశారట!
మరో సందర్భంలో అయితే ఆ అందమైన అమ్మాయిల గురించి, వారి సోగకళ్ళల్లో కనిపించే ఆశ్చర్యాన్ని గురించీ మాట్లాడుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు మన చర్చనీయాంశం – మరొకటి. మనం ఆ బాల్కనీ గురించి ఇప్పుడు చెప్పుకోవాలి.
హాటకమణిఘటితతుంగహర్మ్యాగ్రములు – హాటకము = పసిడి; మణిఘటితములు = మణులు పొదిగిన; తుంగ = ఉన్నతమైన; హర్మ్య = మిద్దెల; అగ్రములు = పైభాగములు; వెరసి బంగారు కాంతులు చిమ్ముతూ మణులు తాపిన ఉన్నతమైన మేడ. మేడంటే మేడా కాదు కానీ, మేడపై వాతాయనమో లేక ఓ మంటపం వంటిదో ఉండాలి. వీటిని కావ్యాలలో ఎన్నో విధాలుగా వర్ణించారు.
మరో ఉదంతం.
అదో పేద్ద భవనం. ఆ భవనం పైన ఒక మంటపం. వాసవదత్త అనే ఒకావిడ ఆ మంటపం పైని తీరుబడిగా నిలబడి పొద్దునే దారిని వచ్చిపోయే నగరపౌరులని చూస్తోంది. ఆ అమ్మణి సౌందర్యం చూసి ఆమెను పెళ్ళి చేసుకోవాలని నగరంలో అందరూ తహతహలాడుతున్నారు. అయితే ఆవిడ మాత్రం ఎవరినీ ఇష్టపడటం లేదు. ఆ రోజు పొద్దున దారిని ఉపగుప్తుడనే బౌద్ధభిక్కువు నిర్వికారంగా వెళుతున్నాడు. వాసవదత్త ఆ భిక్కువుకు చెలికత్తె ద్వారా ఇంటికి విచ్చేయమని కబురంపింది. ఆ భిక్కువు ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించాడు. వచ్చే అవసరం నిజంగా వచ్చినప్పుడు వస్తానని చెప్పి పంపేశాడు.
చాలాకాలం గడిచింది. వాసవదత్తపై నగరపౌరులు కుట్రపన్ని హత్యానేరం ఆరోపించారు. ఆమెను రాళ్ళతో కొట్టి ఊరి నుండి తరిమేశారు. అప్పుడు ఆమెను చూడటానికి ఉపగుప్తుడు వచ్చాడు. పరిచర్యలు చేసి ఆమెను కోలుకునేలా చేశాడు. కాలక్రమంలో ఆమె భిక్షుణి అయింది.
***
ఉపోద్ఘాతపు తంతు ముగిసింది కనుక ఇక విషయానికి వద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఓ చిన్న నాలుక్కాళ్ళ మండపం గురించే. ఇది నాట్యశాస్త్రానికి సంబంధించినది. ఆ నిర్మాణం పేరు మత్తవారణి. ఇది సంస్కృతసాహిత్యంలో ప్రముఖంగా కనిపిస్తుంది.
ఏంటీ మత్తవారణి?
భరతముని ప్రణీతమైననాట్యశాస్త్రం – భారతదేశంలోని ఒక పురాతనమైన గ్రంథం. ఎప్పటికాలందో ఆనవాళ్ళు పట్టలేనంత ప్రాచీనమైన గ్రంథం ఇది. ఈ నాట్యశాస్త్రంలో నాట్యం ఎలా పుట్టిందో మొదలుకుని, నాట్యం యొక్క అంగాలు, నటులు, సామాజికులు,ఇలా సమస్తమూ విపులంగా చర్చింపబడినాయి. నాట్యశాస్త్రం రెండవ అధ్యాయంలో నాట్యమండపం ఎలా ఉండాలో భరతుడు ఎంతో స్పష్టంగా వివరించాడు.ఆశ్చర్యకరంగా ఇందులో నాట్యమండపం కొలతలు నిశితంగానూ, ఖచ్చితంగానూ నిర్దేశించి ఉన్నాయి. అంతే కాక, నాట్యమందిరనిర్మాణానికి ఎటువంటి నేల అవసరం, ఆ నిర్మాణం ఎలా ఆరంభించాలి, ఎలా కొనసాగాలి వంటి వివరాలు విపులంగా వివరించారు.ఈ నాట్యమండపానికి ప్రయోక్త విశ్వకర్మ.
ప్రదర్శన, ప్రేక్షక గృహం, నేపథ్యం – అన్నిటినీ కలగలిపి రంగమందిరం అని భరతముని నిర్వచించాడు.
రంగమందిరం = నేపథ్యగృహం (Rest/Makeup room) + (రంగశీర్షం + రంగపీఠం) (Stage) + ప్రేక్షకనివేశనం (People gallery).
రంగశీర్షము, రంగపీఠము – రెండునూ ఒకే వేదికకు చెందినవి. ఇవి విభిన్నభాగాలు కావు.
ఈ రంగమందిరం ఆకారాన్ని బట్టి మూడు విధాలుగా ఉంటుంది. ౧. వికృష్టము (దీర్ఘచతురశ్రాకారం) ౨. చతురశ్రము (సమచదరం) ౩. త్ర్యశ్రము (సమబాహుత్రిభుజం)
కొలతలను బట్టి ౧. జ్యేష్టము ౨. మధ్యమము ౩. అవరము అని రంగమందిరం మూడు విధాలు. జ్యేష్టమంటే చాలా పెద్దది.ఎంతో మంది ప్రేక్షకులకు అవకాశం కల్పించేది. అవరమంటే చిన్నపాటిది. ఓ కుటుంబానికి సరిపడిన నిర్మాణం. మధ్యమము ఆ రెంటికీ మధ్యనున్నది.
మధ్యమము శ్రేష్ఠము.
వెరసి వికృష్టమధ్యమరంగమందిరం నాట్యప్రదర్శనకూ, సామాజికులకు, శబ్దప్రసారానికి – అన్నిటికీ ఇది శ్రేష్ఠం.
రంగమందిరంలో రంగశీర్షం, రంగపీఠం – ఈ భాగాలను కలిపి, వాటికి రెండువైపులా దీర్ఘచతురశ్రాకారంలో ఒక్కో కట్టడాన్ని నిర్మించాలి. దాన్నే మత్తవారణి అంటారు. ఈ కొలతలతో – మొత్తానికి నాట్యమంటపం మొత్తం ఈ విధంగా ఉంటుంది.
మొత్తం నిర్మాణంలో మత్తవారణి అన్నది ఒక భాగం. ఈ మత్తవారణి అనే నిర్మాణానికి గల ప్రాముఖ్యతను, ఉద్దేశ్యాన్ని గురించి భరతముని నాట్యశాస్త్రంలో ఎందుచేతనో వివరించలేదు. క్రీ.శ. 9 వ శతాబ్దంలో అభినవగుప్తుడనే కాశ్మీరపండితుడు నాట్యశాస్త్రానికి అభినవభారతి పేరిట వ్యాఖ్యానం వ్రాశాడు. అయితే ఆ వ్యాఖ్యానంలోనూ మత్తవారణి యొక్క ఉద్దేశ్యాన్ని వివరించలేదు. నాట్యశాస్త్రం ఆధారంగా తదనంతరకాలంలో అభినయదర్పణం, దశరూపకం వంటి శాస్త్రగ్రంథాలు వెలువడినాయి. అయితే వీటిలో కూడా మత్తవారణి ని గురించి తెలుపలేదు. ఈ మత్తవారణి అంటే ఏమిటి? ఈ నిర్మాణపు ఉద్దేశ్యమేమిటి? దీన్ని పండితులెలా వివరించారు? ఈ శబ్ద వ్యుత్పత్తి ఏమిటి? ఈవిషయాల గురించి విజ్ఙుల అభిప్రాయాలెలా ఉన్నాయి?
అసలు మత్తవారణి గురించి నాట్యశాస్త్రంలో ఏం వ్రాశారో మొదటగా చూడాలి.
మత్తవారణి రంగపీఠస్య పార్శ్వే తు కర్తవ్యా మత్తవారణీ చతుస్స్థంభసమాయుక్తా రంగపీఠప్రమాణతః । అధ్యర్థ హస్తోత్సేధేన కర్తవ్యా మత్తవారణీ ఉత్సేధేన తయోస్తుల్యం కర్తవ్యం రంగమండపమ్ ॥ (నాట్యశాస్త్రం 2.63 – 2.65)
రంగపీఠపు పక్కవైపున మత్తవారణిని నిర్మించవలెను. ఈ మత్తవారణి నాలుగు స్థంభములను, రంగపీఠప్రమాణమును కలిగి ఉండవలెను. దీని యెత్తు ఒకటిన్నర అడుగులు.దీనికి సమమైన యెత్తున రంగమండపము ఉండవలెను.
– రంగపీఠానికి అటుపక్క, ఇటుపక్కా – నాలుగు స్థంభాలను ఏర్పరచి కట్టిన మంటపాలను మత్తవారణి అంటున్నట్టు మనం నాట్యశాస్త్రం ద్వారా గ్రహించవచ్చు. (Side wings of a stage).
ఈ నిర్వచనం ఉన్నప్పటికీ మత్తవారణి అనే నిర్మాణానికి పండితుల అర్థాలు పలురకాలుగా ఉన్నాయి.
౧. ప్రొఫెసర్ భాను, గోదావరి కేత్కర్ గారల ఆలోచన ప్రకారం మత్తవారణి అంటే – ప్రేక్షకగృహానికి రంగపీఠానికి మధ్య గల ఒక పిట్టగోడ/అడ్డుకట్ట వంటిది. నాట్య(నాటక)ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఏ కారణం చేతనయినా ఉద్రిక్తులైన ప్రేక్షకులు రంగపీఠం వద్దకు – అంటే కళాకారుల పైకి వచ్చి దాడి చేయకుండా నిరోధించే ఏర్పాటు మత్తవారణి.
రంగపీఠస్య పార్శ్వే అని నాట్యశాస్త్రంలో వ్రాస్తే కూడా, ఈ పండితులు ఎందుచేతనో రంగపీఠపు అగ్రభాగపు నిర్మాణం అన్నట్టు ఊహించారు.
౨. మత్తవారణి – సంస్కృతంలో వారణ శబ్దానికి ఏనుగు అని అర్థం. “మతంగజో గజో నాగః కుంజరో వారణః కరీ” – అని అమరకోశం. “వారయతి శత్రుబలం ల్యుః ఇతి వారణః” అని వ్యుత్పత్తి. మత్తవారణి అంటే మదపుటేనుగు అనే అర్థాన్ని చెప్పుకుని, ఈ ఏనుగుల ప్రస్తావనను మంటపాలకు అన్వయించి HR దివేకర్ అన్న పండితుడు ఒక సుదీర్ఘమైన, ఆసక్తికరమైన అర్థాన్ని ఊహించాడు.
నేటి కోళ్ళపందేలు, పొట్టేళ్ళపందేల్లాగా పూర్వం ఏనుగుల మధ్య పోట్లాటలు క్రీడావినోదంగా ఉండేవి(ట). ఇటువైపు ఏనుగు అటువైపు ఏనుగు అభిముఖంగా నిలబడ్డాయి. ఎడమవైపు ఏనుగును ఎడమవైపు గుంజకు, కుడివైపు ఏనుగును కుడివైపు ఉన్న గుంజకూ గొలుసులతో కట్టేశారు. ఆ గొలుసులు ఈడుస్తూ ఏనుగులు కొంతదూరం వరకే నడువగలవు. ఆ తెర లేవగానే ఈ రెండున్నూ స్టేజ్ మీదకు వచ్చి కొట్టుకుంటాయి.పోరాటం జరిగే సమయాన రెండు మదపుటేనుగులూ కొట్టుకొని ప్రేక్షకుల మీద వచ్చి పడకుండా గుంజల ఏర్పాటు! గెలిచిన ఏనుగుకు బహుమానం. జో జీతా వో సికందర్.
వ్యాసంలో ఇదివరకు మత్తవారణి నిర్మాణం గురించి నాట్యశాస్త్రపు నిర్వచనం చూశాం కదా. అందులో “చతుస్స్థంభసమాయుక్తా” – అని ఉన్నది. దానిని “చతుస్స్తంబసమాయుక్తా” అని చదువుకోవాలి. స్తంబ శబ్దానికి గుంజ అన్న అర్థం ఉంది.(హలాయుధనిఘంటువు,హేమచంద్రుడు) అలా చదువుకుంటే మత్తవారణికి ఈ నిర్వచనం సరిపోగలదు.
ఈ ఊహకు ప్రమాణంగా డాక్టర్ దివేకర్ – రఘువంశంలోని ఈ శ్లోకాన్ని ఉటంకించాడు.
12 వ సర్గలోని రామరావణయుద్ధ ఘట్టం యిది.
విక్రమవ్యతిహారేణ సామాన్యాభూత్ద్వయోరపి । జయశ్రీ రంతరావేది ర్మత్తవారణయోరివ ॥ (రఘువంశం – 12.93)
ద్వయోరపి = రామరావణుల మధ్య; విక్రమవ్యతిహారేణ = ప్రతాపముల మార్పిడి చేత; జయశ్రీః = విజయలక్ష్మి; మత్తవారణయోః అంతః ఇవ = మదపుటేనుగుల ద్వయము మధ్య (తలపడుట) వలె; ఆవేది = తెలియదగినది; (ఆవేదిరంతః మత్తవారణయోః ఇవ = అటునిటు గల మత్తవారణి అను రెండు నిర్మాణముల మధ్య నిమిత్తమాత్రమైన రంగపీఠము వలె) (ఆ విజయలక్ష్మి) సామాన్యా అభూత్ = కేవలముగా మిగిలినది.
యుద్ధంలో రామరావణులు ఇద్దరూ సమానమైన ప్రతాపంతో, రెండు మదపుటేనుగుల వలె పోరాడ్డం చేత విజయలక్ష్మి నిమిత్తమాత్రంగా ఉండిపోయింది. రామరావణయుద్ధంలో ఇద్దరూ సమాన ప్రతాపంతో పోరాడ్డం వల్ల, ఏనుగుల పోరాటం కోసం వెలసిన వేదికలా విజయలక్ష్మి నిమిత్తమాత్రంగా ఉండిపోయింది.
మత్తవారణి శబ్దానికి దివేకర్ పండితుని ఊహ – అలా సుదీర్ఘంగా సాగింది. అయితే నిజంగా ప్రాచీన కాలంలో ఏనుగుల యుద్ధాలు ఉన్నవా? వాటిని ప్రేక్షకులు చూచి ఆనందించే వారా? కాళిదాసు నిజంగా ఏనుగుల పోరాటాన్ని ఉద్దేశించి వ్రాశాడా లేక ఇది వ్యాఖ్యాతల చమత్కారమా? – ఇవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి. కాళిదాసు గుప్తుల కాలం నాటి కవి. గుప్తుల కాలంలో యుద్ధాలలో ఏనుగులు ప్రముఖపాత్ర పోషించేవి. కనుక ఏనుగుల పోరాటాన్ని కాళిదాసు చూచి ఉండవచ్చు. అయితే ఏనుగుల మధ్య పోట్లాట వర్ణనలో నాట్యశాస్త్రపు నిర్మాణం దూరాన్వయంగా కనబడుతుంది.
అదే మత్తవారణ శబ్దాన్ని మృచ్ఛకటికనాటకంలో – ఆ నాటకకర్త అయిన శూద్రకుడు వర్షాకాలపు వర్ణనలో ఉపయోగించాడు.
బలాకాపాండురోష్ణీషం విద్యుదుత్ క్షిప్తచామరమ్ । మత్తవారణసారూప్యం కర్తృకామమివాంబరమ్ ॥
వర్షాకాలపు ఆకాశం మదపుటేనుగుతో సామ్యాన్ని పొందాలన్నట్టు రూపు ధరించి ఉంది. కొంగలబారు – కుంభస్థలంపై పట్టుపాగాలాగా, మెరుపులు వింజామరల్లాగా ఉన్నాయి.
సందర్భాన్ని బట్టి ఇక్కడ ఇది నాట్యమంటపానికి చెందిన నిర్మాణం అనే అర్థం రానే రాదు. ఇదే విధంగా కాళిదాసు కూడా మత్తవారణ శబ్దాన్ని ఏనుగులకే అన్వయించి ఉండొచ్చు.
౩. పైన చెప్పిన మొదటి అర్థం కొంత, రెండవ అర్థంలో – వీటిని రెంటిని కలిపి డా. సుబ్బారావు అనే ఒకాయన మరొక అర్థాన్ని ఊహించాడు. ఈయన చెప్పేదేమంటే – మత్తవారణి అంటే – రంగపీఠం (Stage) అందంగా కనిపించేలా అలంకరించటం కోసం పీఠపు అగ్రభాగాన కొంత ఎత్తువరకు రాతిఏనుగుల శిల్పాల వరుస.మత్తవారణి అంటే అదేను! నాట్యశాస్త్రంలో “అధ్యర్ధ హస్తోత్సేధేన కర్తవ్యా మత్తవారణి” అని నిర్దేశించారు. అధ్యర్థ – అంటే అర్ధానికి ఒకింత ఎక్కువ (ముప్పావు) అడుగు ఎత్తులో ఉండాలి కనుకా, మత్తవారణి అంటే ఏనుగులు అని ఊహ్యం కనుకా సుబ్బారావు గారు ఈ ఊహ చేశారు.
సుబ్బారావు గారు పేర్కొన్న మత్తవారణి వంటిది ఎల్లోరాగుహల్లో ఒకటి కనిపిస్తోంది. ఇది నాట్యప్రదర్శనశాల అనే ఆ ప్రాంతాల ప్రసిద్ధం.
౪. ఇంతకూ మత్తవారణి అంటే ఏమిటి? ఈ విషయంలో వీ.వీ. మిరాశీ గారు చాలా స్పష్టంగా, విపులంగా వివరణను ఇచ్చారు. ముందుగా ఆయన ఖండనలను చూద్దాం.
డా. సుబ్బారావు గారి ఊహపై మిరాశీ పండితుని ఖండన ఇలా ఉంది. “అధ్యర్ధ హస్త” – అంటే ఒక అడుగుకు (హస్తానికి) పై, మరొక అర్ధహస్తాన్ని ఏర్చటం వెరసి, ఒకటిన్నర అడుగు. రంగపీఠస్య పార్శ్వే అని నాట్యశాస్త్రంలో పేర్కొన్నారు కనుక రంగపీఠపు అగ్రభాగాన అన్న ఊహ చెల్లదు. తయోః అని మత్తవారణి నిర్వచనంలో చెప్పారు కనుక రెండు మత్తవారణ నిర్మాణాలు ఉండాలని మిరాశీ గారు వివరించారు. (సుబ్బారావు గారి వివరణలో తయోః అంటే రంగపీఠము, రంగపార్శ్వము – ఈ రెంటి యొక్క అని ఉంది. తయోః అన్న శబ్దానికి సుబ్బారావు గారి వివరణ ఉంది. అయితే మిరాశీ గారు వివరణ లేదన్నట్టు భావించారు)
మత్తవారణి శబ్దానికి పండితులు చెప్పిన విగ్రహవాక్యం – “మత్తా వారణా యస్యాం సా – మత్తవారణీ – కక్ష్యా శ్రేణిర్వా” – బహువ్రీహి సమాసం. మదించియున్న ఆడుయేనుగు. దీనిని కక్ష్యకు శ్రేణికి కూడా ఉపయోగింపనగును. అయితే – పాణిని వ్యాకరణసూత్రం (అజాద్యతః టాప్) ప్రకారం ఆ సమాసం “మత్తవారణా” అవుతుంది కానీ, “మత్తవారణి” కాజాలదని మిరాశీ అనే పండితుడు వ్రాశాడు. మరి మత్తవారణి శబ్దానికి అసలు నిర్వచనం ఏమిటి? “మత్తానాం రాక్షసాదీనాం వారణీ మత్తవారణీ” – షష్ఠీతత్పురుషసమాసం.
మత్తవారణి శబ్దవిచారణ చేసిన అందరున్నూ నాట్యశాస్త్రంలో ద్వితీయాధ్యాయంలోని మత్తవారణి నిర్వచనాన్ని ప్రధానంగా చూశారు. అయితే నాట్యశాస్త్రం మొదటి అధ్యాయంలో ఈ శ్లోకాలు ఉన్నాయి.
పార్శ్వే చ రంగపీఠస్య మహేంద్రః స్థితవాన్ స్వయమ్ స్థాపితా మత్తవారణ్యాం విద్యుత్ దైత్యనిషూదనీ । స్తంభేషు మత్తవారణ్యాః స్థాపితాః పరిపాలనే భూతయక్షపిశాచాశ్చ గుహ్యకాశ్చ మహాబలః ॥ (నాట్యశాస్త్రం -1. 90.91)
రంగపీఠం పక్కభాగమందు మహేంద్రుడు స్వయముగా కొలువై ఉన్నాడు. మరియు బ్రహ్మ మత్తవారణులను సంరక్షించుటకు వజ్రాయుధమును, స్థంభాల యందు యక్షులను, భూతపిశాచాలను నిక్షేపించును.
నాట్యశాస్త్రం మూడవ అధ్యాయంలో మత్తవారణుల స్థంభాలకు – పూలను, పాలు తేనెలను, వండిన అన్న మాంసాదులను నైవేద్యంగా అర్పించాలని కూడా భరతముని నిర్దేశించాడు.
మిరాశీ గారు ఈ శ్లోకాలను పేర్కొని, మత్తులయిన రాక్షసులను వారించేది కనుక మత్తవారణి అన్న వ్యుత్పత్తి వచ్చిందని పేర్కొన్నారు. వీరి వివరణ బావుంది కానీ భూతయక్షపిశాచాలు మత్తవారణి స్థంభాలను రక్షించడానికి పూనుకొన్న పక్షాన రాక్షసులను వారించడం ఎలా కుదురుతుంది? రాక్షసులు, భూతపిశాచగణాలు వేర్వేరా? ఒక పక్షంలోని వారు కారా?
ఈ ప్రశ్నలు ఉదయించే అవకాశం ఉంది. మరొక విషయం. మిరాశీ గారి ఉద్దేశ్యం ప్రకారం మత్తవారణి అన్న నిర్మాణం – నాటకం జరుగుతుండగా మధ్యలో తెరపై అవసరం లేని నటీనటులు తాత్కాలికంగా పక్కకు తప్పుకోవడానికి ఉపకరించే గది లాంటిది. ఈ వివరణను జీకే భట్ గారు ఖండించారు. నటీనటులు తెరమరుగు కావడానికి నేపథ్యగృహం ఉండగా తిరిగి మత్తవారణి అవసరం లేదని భట్ గారి అభిప్రాయం.
అలా ఉంటే – కేరళలో నాట్యశాస్త్రం ఆధారంగా దేవాలయాల సమీపాన రంగమందిరాలను నిర్మించారు. ఈ నిర్మాణాలు నాట్యప్రదర్శనలకై ఉద్దేశించినవి. ఈ నిర్మాణానికి కూతాంబలం అని పేరు. కేరళలో ప్రఖ్యాతదేవాలయలకు ఈ నిర్మాణాలు ఉన్నవి.
ఈ కూతాంబలం లో మత్తవారణి అన్న నిర్మాణం ప్రత్యేకంగా కనిపించక పోయినా పరంగపీఠానికి ఇరుప్రక్కలా వాయిద్యకారులు, పాటలు పాడేవారు కూర్చోవడానికి కొంత భాగం నిర్దేశించినట్టు కనిపిస్తుంది. ఇది మత్తవారణికి అనుసరణ కావచ్చును.
ఇదివరకు చెప్పుకున్నట్టు మత్తవారణి అన్న చతుశ్శాలామంటపాన్ని గురించి ఆలంకారిక గ్రంథాల్లో వివరణ లేదు. అయితే కావ్యాలలో అక్కడక్కడా ఈ శబ్దం అగుపిస్తుంది.రాజశేఖరుడనే సంస్కృతకవి బాలరామాయణ కావ్యాన్ని రచించాడు. ఆ కావ్యంలో –
పరశురాముడంటే ఇంద్రునికి అభిమానం. ఇంద్రునికి పరశురామునిపై గల అభిమానాన్ని ఇంద్రుని సారథి మాతలి – ఒకానొక సందర్భంలో దశరథునికి వివరించాడు. ఇంద్రుని దర్బారులోనూ, విలాసగృహంలోనూ, జైత్రరథంలోనూ పరశురాముని వీరోచిత ఉదంతాల చిత్రాలను లిఖింపజేశాడు. అంతే కాదు.
“యదస్యైవ పురందరస్యందనస్య చతుర్దిశం మత్తవారిణీఫలకేషు రామచిత్రం లిఖితమ్ ।”
మహేంద్రుని రథం యొక్క మత్తవారణీ ఫలకాలలో కూడా పరశురాముని చిత్రఫలకాలు రచింపబడి ఉన్నాయి.
రాజశేఖరుని వర్ణనలో మత్తవారణి – స్పష్టంగా నాట్యశాస్త్రంలోనిదని తెలుస్తున్నది. రథం యొక్క పార్శ్వభాగాలలో అన్న అర్థంలో మత్తవారణి శబ్దాన్ని ఉపయోగించాడు కవి.
శోఢ్ఢలుడనే కవి ఉదయసుందరికథ అన్న చంపూకావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలోనూ అక్కడక్కడా మత్తవారణి అన్న నిర్మాణాన్ని పేర్కొన్నాడు.
విశ్వప్రకాశమనే ఒక కోశంలో మత్తవారణి అంటే – నది ఒడ్డున ఉన్న పావంచా. లేదా మహాప్రాసాదాలకు ముందున్న వరండా వంటిది. మహారాజప్రాసాదాలలో రాజుల కోటలకు ముందున్న ప్రాంగణాలలో ఏనుగులను కట్టే వారట.
మత్తవారణమిచ్ఛంతి దానక్లిన్నకరే ద్విపే । మహాప్రాసాదవీథీనాం వరణ్డే చాప్యపాశ్రయే ॥
ఆ నిర్వచనాన్ని అనుసరిస్తూ ఒకానొక కావ్యంలో కాశీపురివర్ణన ఇలా ఉంది.
వింధ్యాధరాధరభూరివ సా రాజతి మత్తవారణోపేతా । బహుళనిశీథవతీవ ప్రోజ్వల ధిష్ణోపశోభితా యా చ ॥
ఇది శ్లేష పద్యం. ఉన్నతమైన భవనాలతో విరాజిల్లే కాశీపురి, మదపుటేనుగులు అరించే వింధ్యపర్వతావని లా ఉంది. బహుళపక్షపు రాత్రుల్లో నక్షత్రాల్లా ఆ భవనాలు రాత్రి వేళల మిణుకుమిణుకుమని మెరుస్తున్నాయి. ఇక్కడ మత్తవారణి పేరుతో ప్రాసాదాల వరండాలను, గంగానది ఒడ్డున విరాజిల్లే భవనాలను కవి ఉటంకించినట్టు కనబడుతుంది.
అయితే – డా. షా, డా. సందేశర అన్న పండితులు మత్తవారణికి ఎత్తైన ప్రదేశంలో రాణులు/ముదితలు కూర్చుండటం కోసం కట్టిన నిర్మాణం అన్న అర్థం చెప్పారు. దీనికి దిడ్డి అని పేరు. ఝరోకా అని ఉరుదూలో పేరు.
“మత్తాః ప్రమాదేన పతంతః వార్యంతే అనేన ఇతి మత్తవారణి”
నాట్యప్రదర్శన చూస్తూ మైమరచి ముదితలు క్రిందపడకుండా – చక్కగా కట్టిన నిర్మాణం మత్తవారణి. అంటే ఇది రంగపీఠం (Stage) కు పక్కగా నాలుగు స్థంభాలు ఊనికగా కట్టిన ఒక బాల్కనీ వంటిది. ఈ ఊహను జీకే భట్ అన్న పండితుడు ఆమోదించినట్టు కనిపిస్తుంది. ఆయన ఉద్దేశ్యం ప్రకారం – ఇలాంటి బాల్కనీ – సంస్కృతనాటకప్రదర్శనలో భాగంగా కూడా అవసరమవుతుంది. (హనుమంతుడు ఎగరటం,విక్రమోర్వశీయంలో ఊర్వశి పైనుండి దిగిరావడం వంటి దృశ్యాలను మనం ఊహించుకోవచ్చు).
ఈ చివరి వివరణలోని నిర్మాణం సరిగ్గా – వ్యాసం మొదట్లో పోతన చెప్పిన “హాటకమణిఘటితతుంగహర్మ్యాగ్రము” నాబడు బాల్కనీ కి దగ్గరైనదే.
ఉపయుక్తములుః
నాట్యశాస్త్రం – పోణంగిరామ అప్పారావు గారు నాట్యశాస్త్రం – అభినవభారతి – మానవల్లిరామకృష్ణకవి సంపాదకత్వంలో – గైక్వాడ్ ఓరియంటల్ సిరీస్ Theatric Aspects Of Sanskrit Drama – GK Bhat Literary and Historical studies in Indology – V.V. Mirashi RaghuvaMSa – Sanskritdocuments.org and few other internet resources. Pictures from internet.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™