ఇరానియన్ దర్శకుడు అబ్బాస్ కిరోస్తమీ కాశ్మీర్లో ఏదైనా సమస్య మీద సినిమా తీస్తే ఎలా వుంటుంది? ప్రవీణ్ మోర్చలే తీసిన ‘విండో ఆఫ్ సైలెన్స్’లా అచ్చు గుద్దినట్టు వుండొచ్చు. ఉర్దూలో ప్రవీణ్ మోర్చలే తీసిన ఈ కశ్మీరీ సినిమా నూటికి నూరు పాళ్లూ కిరోస్తమీని గుర్తుకు తెచ్చే అన్ని కళా విలువలతోనూ వుంది. ఆ మాటకొస్తే తనకి స్ఫూర్తి కిరోస్తమీయే. దీంతో తన పంథా కిరోస్తమీయే అయింది. సినిమా అనుభవం లేకుండా నాటకరంగం నుంచి వచ్చిన ప్రవీణ్, శక్తివంతమైన ప్రాంతీయ సినిమాలు తీస్తూ అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. ‘విండో ఆఫ్ సైలెన్స్’ (2018) కి పన్నెండు జాతీయ, అంతర్జాతీయ అవార్డు లందుకున్నాడు. కాకపోతే తన సినిమాలని చలన చిత్రోత్సవాలకే పరిమితం చేసుకున్నాడు. ఇంకెక్కడా ప్రేక్షకులు చూసేందుకు అందుబాటులో వుంచడం ఇష్టం లేదు. వెతగ్గా వెతగ్గా ఎక్కడో విదేశంలో ఒకే ఒక్క చోట, అదీ ప్రాధాన్యం లేని ఓ వెబ్సైట్లో ఈ సినిమా అనామకంగా పడుంది. డబ్బులు కట్టి చూసుకోవాలి.
ఇండోపాక్ సరిహద్దు నియంత్రణ రేఖకి కేవలం 17 కిమీ దూరంలో, అత్యంత ప్రమాదకర లొకేషన్లలో ఈ సినిమా నిర్మించానని చెప్పే ప్రవీణ్‌కి, ప్రసిద్ధ ఇరానియన్ ఛాయాగ్రహకుడు మహ్మద్ రెజా జహాపనా తోడయ్యాడు. 50 వరకూ ఇరానియన్ సినిమాలకి, డాక్యుమెంటరీలకి, షార్ట్స్‌కీ ఛాయాగ్రహణం సమకూర్చిన ఇతను, ప్రవీణ్ గత సినిమా ‘వాకింగ్ విత్ ది విండ్’కి కూడా పని చేశాడు. దీన్ని హిమాలయాల్లో తీశారు.
కాశ్మీర్లో రాజ్యం – ఉగ్రవాదం కథలతో ఎన్నో సినిమాలొచ్చాయి. అమాయకుల ఎన్కౌంటర్ల మీద కూడా వచ్చాయి. పురుషులనే బాధితులుగా చూపించే ఒక బాక్సాఫీసు ఫార్ములా స్థిరపడింది. స్త్రీలని మీరుండడమ్మా అని పక్కన పెట్టేశారు. ఎంతకాలం వుంటారు, వుండలేరు. ప్రవీణ్ మోర్చలే లాంటి వాడొకడొచ్చి, వాళ్ళ కథలు కూడా తెరపైకి తెస్తాడు. కల్పిత కథలు కాదు, వాస్తవ కథలు. కాశ్మీర్లో ప్రశ్నార్ధకంగా మిగిలిన వాస్తవ సామాజిక సమస్య. సమస్యా పరిష్కారానికి ఫత్వా జారీ చేసినా, ప్రభుత్వ యంత్రాంగం నాన్చుతున్న సమస్య. స్వార్థానికి వాడుకుంటున్న సమస్య. ఇదేమిటో చూద్దాం…
ఆసియా (శిల్పీ మార్వాహా) అనే ఆవిడ పదకొండేళ్ళ కూతురితో, అత్తగారితో కాశ్మీర్‌లోని ఓ కుగ్రామంలో నివసిస్తూ వుంటుంది. అక్కడ్నించి దగ్గర్లోని ఫుల్వామాకి ట్రైనీ నర్సుగా టాక్సీలో వెళ్ళి వస్తూ వుంటుంది. కూతురు ఇనయా (నూర్జహాఁ) స్కూలుకి వెళ్తూంటుంది. అత్తగారు(జబా బాను) ఇంట్లో బందీ అయి వుంటుంది. అనారోగ్యంతో వున్న ఈమెని ఇంట్లో పెట్టేసి తాళం వేసుకు పోతుంది ఆసియా. స్కూల్లో తోటి పిల్లలు కూతుర్ని వెక్కిరిస్తూ వుంటారు. దీని కంతటికీ కారణం ఆసియా భర్త లేకపోవడం. ఏడేళ్ళ క్రితం అతణ్ణి భద్రతా దళాలు ప్రశ్నించడానికి తీసికెళ్లి పోయాయి. అప్పట్నించీ అతను తిరిగిరాలేదు, కనిపించలేదు. నాల్గేళ్ళు ఎదురు చూసింది, వెతికింది, అన్ని ప్రయత్నాలూ చేసింది. భర్త ఎక్కడో జైల్లో మగ్గుతూ వుండొచ్చు, లేదా సామూహికంగా ఖననమైపోయి వుండొచ్చు. ఏదీ నిర్ధారణ కావడం లేదు. ఇక లాభం లేదని, భర్తృ విహీనగా చుట్టూ ఎదుర్కొంటున్న సామాజిక బహిష్కరణ నుంచి రక్షణకి, కూతురి భవిష్యత్తుకి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. మత పెద్దలు జారీ చేసిన ఫత్వా ప్రకారం, కాశ్మీర్లో అదృశ్యమైన భర్త కోసం నాల్గేళ్ళ నిరీక్షణ తర్వాత పునర్వివాహం చేసుకోవచ్చు. అయితే ఇందుకు భర్త మరణ ధృవీకరణ పత్రం అవసరం. ఈ పత్రం కోసమే మూడేళ్లుగా ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరుగుతోంది ఆసియా.
ఈ పత్రం వుంటే పునర్వివాహమే కాదు, ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నిరుద్యోగ భర్త ముస్తాక్ ఆస్తి తనకి సంక్రమిస్తుంది. పైగా తనని ఇష్టపడుతున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఈ పత్రం కోసం స్థానిక రిజిస్ట్రార్ (అజయ్ చౌరే) ని ప్రాథేయపడుతూంటే, అతను కోరిక తీర్చమంటూ వేధిస్తున్నాడు. అంతే కాదు, ఆ పొలం తన స్నేహితుడికి అమ్మేయాలని, అమ్మేసి ఇరవై శాతం కమిషన్ తనకివ్వాలని కూడా షరతు పెడుతున్నాడు. ఇన్ని సమస్యల్ని తానెలా ఎదుర్కోగలదు? పోనీ ఎవరికి చెప్పుకోగలదు? మత పెద్దలు ఫత్వా జారీ చేశారే గానీ, దాని అమలుకు తనలాటి బాధితురాళ్ళకి తోడ్పాటు నందించే బాధ్యత తీసుకోలేదు. ఇప్పుడేం చేయాలి? ఇదీ సమస్య.
జమ్మూ కాశ్మీర్లో భర్తలు అదృశ్యమైన స్త్రీలని హాఫ్ విడో లంటున్నారు. వీరి సంఖ్య 2,500. వివిధ పత్రికల కథనాల ప్రకారం, అప్పటికి రెండు దశాబ్దాలుగా భర్తలు అదృశ్యమైన స్త్రీల సమస్య జటిల మవుతున్న పరిస్థితుల్లో, చిట్ట చివరికి 2013లో, మతపెద్దలు చర్చించుకుని పైన చెప్పుకున్న ఫత్వా జారీ చేశారు. ఇప్పటికీ ఈ ఫత్వావల్ల విముక్తులైన స్త్రీలు కొద్ది మందే. అనేకులు పునర్వివాహ వయసు దాటిపోయి దుర్భర ఒంటరి జీవితాలు గడుపుతున్నారు. కుటుంబాలు కూడా మళ్ళీ పెళ్ళికి మోకాలొడ్డుతున్నాయి. దీనికి మతపెద్దలు పరిష్కారం చూపలేదు. ప్రభుత్వం దగ్గర ఏ ప్రణాళికా లేదు. బాధితురాళ్ళకి ఉపాధి పథకాలు, పెన్షన్ పథకాలూ ఏవీలేవు. నష్టపరిహారం సరే. భద్రతా దళాలు పట్టుకెళ్లిన పురుషుల అదృశ్యాల పట్ల ప్రభుత్వం నిర్లిప్తంగా వుంటోంది. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా తీసుకునే పరిస్థితి లేదు, పైగా బెదిరింపులు. తల్లులు పోషించలేని పిల్లలు అనాథ శరణాలయాలకి చేరాల్సిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా పరిస్థితిలో వచ్చిన మార్పేమీ లేదు.
భర్తల మరణ ధృవీకరణ పత్రం పొందడం ఒక దుస్సాధ్య తంతు అయి పోతోంది. కార్యాలయాల్లో అవినీతి, వివక్ష, పీడన పెచ్చరిల్లి పోయాయి, లైంగిక వేధింపులు సహా. సామాజిక వెలివేత అదనం. బురఖా కశ్మీరీ సంస్కృతి కాదు. అయినా ఇలాటి స్త్రీలు బురఖా ధరించి తిరుగుతున్నారంటే అదొక నిరసన అస్త్రంగానే. మతపెద్దల దగ్గర ఫత్వా కార్యాచరణ లేదు, ప్రభుత్వం దగ్గర ఏ రక్షణా లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా తీశాడు దర్శకుడు ప్రవీణ్ మోర్చలే.
సినిమా తీసినప్పుడు కథని బాధితురాలు – వ్యవస్థ -సమాజం త్రికోణంలో సమస్యని స్థాపించాడు. పరిష్కారం ఏం చెప్పాడన్నది ముగింపులో తేలుతుంది. ముగింపు బలమైనది. అయితే బాధాకరమైనది. వాస్తవమైనది కూడా. పరిష్కారం వ్యవస్థే ఆలోచించాలి, సమాజమే ఆలోచించాలి. వీటి బాధితులు అశక్తులు. దేశమంటే ప్రభుత్వామో, మతమో కాదనీ, దేశమంటే ప్రజలనీ గుర్తించనంత కాలం, సమస్యలు పరిష్కారం కావనేది చరిత్ర చెబుతున్న వాస్తవమే.
‘నీ చావుకి ముందు నువ్వు బతికున్నావని నువ్వు రుజువు చేసుకోలేవు’ అంటాడు వ్యవస్థ ముసుగు తీస్తూ స్థానిక రిజిస్ట్రార్. ‘నేనిప్పటికే శవ పేటికలో వున్నాను’ అంటుంది, కార్గిల్ యుద్ధంలో కొడుకుని పోగొట్టుకుని జీవచ్ఛవంలా బతుకుతున్నవయసు మళ్లినావిడ. ‘ఆడది మగవాడి పక్కన కూర్చోవడం మగవాణ్ణి చంపడం కన్నా పాపం’ అంటాడు మతం మీద జోకేస్తూ టాక్సీ డ్రైవర్. భర్తల మరణ ధృవీకరణ పత్రాల వేటలో మొగ్గలు మోడులై పోతున్న మౌన సమూహంలో ఆసియా ఒకతి. మొగ్గలకి నీళ్ళు పోస్తూ మౌనంగా మొదలవుతుంది, మొగ్గలకి నీళ్ళు పోస్తూనే మౌనంగా ముగిస్తుంది. ఎటు తిరిగి భూమి గుండ్రంగా వుంది. ఆమె స్వేచ్ఛా గవాక్షమొక నివురు గప్పిన నిశ్శబ్ద కాష్ఠం.
ఆమె పదేపదే పరుగులు తీస్తూ వెళ్ళి, పరుగులు తీస్తూ వచ్చే రహదారి సైతం ఆమెకిదే చెప్తుంది: ఈ చక్రభ్రమణం లోంచి బయట పడలేవని.
ఈ పాత్ర నటించిన శిల్పీ మార్వాహా ఢిల్లీ రంగస్థల నటి, రచయిత్రి. హక్కుల కార్యకర్త కూడా. వీధి నాటకాలు కూడా వేసింది. గొంతెండి, పిడచగట్టుకుపోయిన నాలుక ఆసియా పాత్రకి ఆమె ఇచ్చిన ఇమేజి. ఈ నాలుకకి అనంత కాల దాహార్తే అన్నట్టు పాత్రని సింబాలిక్‌గా నిలబెట్టింది. కెమెరా ద్వారా దర్శకుడు కూడా ఆయా ఘట్టాల్లో పాత్రకి దృశ్యపరమైన భాష్యాలు చెప్పాడు. శబ్దం వాడలేదు. నిశ్శబ్ద దృశ్యాలే కథా నడక. ఓపికపట్టి చూడాలి. అతి నిదానమైన ఈ నడక కావాలనే దర్శకుడి వ్యూహం. బయటి ప్రపంచానికి తెలీని ఈ భూతల స్వర్గపు మానవ వికృతి ఆకళింపు అవాలంటే భావచిత్రాల్నిలా మస్తిష్కాల్లో బలంగా ముద్రించాల్సిందే. ‘ఇక్కడ మన ఫీలింగ్స్ కూడా మనకి ఖరీదైనవి’ అనే కరకు వాస్తవం ఆమె తోటి ఉద్యోగిని చెప్పడం కాశ్మీరు స్త్రీ స్వేచ్ఛ ఏమిటో తెలుపుతుంది. లైంగిక వేధింపులు, ఆర్థిక వేధింపులు – వీటి విష కౌగిట్లోనే జీవితాలు వెళ్ళమార్చెయ్యాలి…
సికందర్ ప్రముఖ సీనియర్ సినీ జర్నలిస్ట్. సినీరంగానికి చెందిన అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉన్న విశ్లేషకుడు. ఎన్నో పత్రికలలో భారతీయ, అంతర్జాతీయ సినిమాలను విశ్లేషిస్తుంటారు. వీరు నిర్వహించే “సినిమా స్క్రిప్ట్ అండ్ రివ్యూ” అనే బ్లాగు ప్రసిద్ధి చెందినది.
I like this movie! Thanking you for the review.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™